వేళ గాని వేళ... ఏమిటీ అలజడి రేపే కొత్త పాట!
ఆ డిసెంబరు తరువాత ఎక్కడా వినిపించలేదు...
పోనీ వచ్చే డిసెంబరు దాకా ఆగిందీలేదు...
వేళ గాని వేళ... అనుమానాలు రేకెత్తించేలా ఏమిటీ అపశ్రుతుల గానాలాపన?
ఇది ఉద్యమ విక్రేతల నడుం విరగ్గొట్టే పాటైతే... స్వాగతం!
ఇది మాటిమాటికీ మాట మార్చేసే వారిపై, ప్లేట్ తిప్పేసే వారిపై కొరడా ఝళిపిస్తానంటే... మరీ మరీ స్వాగతం!
కానీ ఆ పాట స్వరశ్రుతిలోనే ఏదో తేడా... పోరాటగీతం అంటే ఆరునెలలకోసారి సాగించే ఆలాపన కాదుగా!?
ఈ పాటంటేనే కదూ... వేనవేల గొంతులు కోరస్ పాడినై...
ఈ పాట విన్నాకే కదూ.. వేల గుండెలు పల్లెల్లో అరాచకాలపై అగ్ని పూలు కురిపించినై...
గజ్జె కట్టి ఈ పాట నర్తిస్తేనే కదూ... వేల చేతులు బందూకులు అందుకున్నై...
ఈ పాట వింటూనే కదూ... ఎన్నో కళ్ళు అడవుల్లో నిద్రిస్తూ కొత్త ఉదయం కొసం కోటి కలలు కన్నాయి...
ఈ పాటె కదూ... అమరుల కోసం తల్లడిల్లి కన్నీళ్ళు పెట్టిన ఎన్నో కుటుంబాల కుశలం అడిగి ఊరడించింది...
మరెందుకీ వేళ గాని వేళ ఈ పాటే... లక్ష సందేహాల వీచికలను మోసుకుంటూ కొత్తగా వినిపిస్తోంది...?
విజయమో, వీర పోరాటమో... నిర్ణయం తేల్చుకోవల్సిన ఉదయం రేపో మాపో భళ్ళున తెల్లరన్నున్న వేళ... ఏమిటీ సందేహగీతం!
పల్లెకు వెళ్ళేందుకు మొహం లేని ద్రోహులకు ఈ పాట తన మొహాన్ని అరువివ్వదు కదా!
సమైక్య నేతల కాళ్ళను వీడని పిరికి గొంతుకలకు ఈ పాట కోరస్ పాడదు కదా!
ఉద్యమ నియంతల ఆట కట్టించాల్సిన ఈ పాట... వీరులను కూడగట్టాల్సింది పోయి తనే చెదరగొట్టదు కదా!
ఓ పాటా... నువ్వే జెర పైలం; ఆగం గాకు, పోరాటాన్ని పరేషాన్ చెయ్యకు!!
No comments:
Post a Comment